‏ 2 Kings 5

1సిరియా రాజు సైన్యాధిపతి పేరు నయమాను. అతని ద్వారా యెహోవా సిరియా దేశానికి విజయాలిచ్చాడు. అందుచేత అతడు తన రాజు దృష్టిలో గొప్పవాడూ, గౌరవనీయుడూ అయ్యాడు. ఎంతో ధైర్యవంతుడూ, బలవంతుడూ అయినప్పటికీ అతడు కుష్ఠ రోగి. 2సిరియనులు దోపిడీలు చేయడానికి దళాలుగా ఇశ్రాయేలు దేశంలోకి వెళ్తూ ఉండేవాళ్ళు. ఒకసారి వాళ్ళు అక్కడనుండి ఒక అమ్మాయిని బందీగా పట్టుకుని వచ్చారు. ఆ అమ్మాయి నయమాను భార్యకు పరిచారిక అయింది.

3ఆ అమ్మాయి తన యజమానురాలితో <<షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గరికి నా యజమాని వెళ్ళాలని ఎంతో ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆయన నా యజమాని కుష్ఠరోగాన్ని నయం చేస్తాడు>> అంది. 4కాబట్టి నయమాను తన రాజు దగ్గరకు వెళ్ళి ఇశ్రాయేలు దేశం నుండి వచ్చిన అమ్మాయి చెప్పిన మాటను వివరించాడు.

5సిరియా రాజు <<నీవు వెళ్ళు. నేను ఇశ్రాయేలు రాజుకి లేఖ పంపిస్తాను>> అన్నాడు. నయమాను తనతో మూడు వందల నలభై కిలోల వెండీ, ఆరు వేల తులాల బంగారం, పది జతల బట్టలూ తీసుకుని బయల్దేరాడు. వాటితో పాటు ఆ లేఖను కూడా తీసుకు వెళ్ళి ఇశ్రాయేలు రాజుకి అందించాడు. 6ఆ లేఖలో <<నా సేవకుడైన నయమానుకి ఉన్న కుష్ఠరోగాన్ని నీవు బాగు చేయాలి. అందుకే ఈ లేఖను అతనికిచ్చి పంపిస్తున్నాను>> అని ఉంది.

7ఇశ్రాయేలు రాజు ఆ లేఖ చదివి తన బట్టలు చింపుకున్నాడు. <<ఒక మనిషికి ఉన్న కుష్ఠరోగాన్ని బాగు చేయమని ఇతడు నాకు లేఖ రాయడం ఏమిటి? మనుషుల్ని చంపడానికీ బదికించడానికీ నేనేమన్నా దేవుడినా? ఇతడు నాతో వివాదం పెట్టుకోవాలని చూస్తున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది>> అన్నాడు.

8ఇశ్రాయేలు రాజు తన బట్టలు చింపుకొన్న సంగతి దేవుని మనిషి ఎలీషా విన్నాడు. అప్పుడు అతడు ఇశ్రాయేలు రాజుకి <<నీ బట్టలెందుకు చింపుకున్నావు? అతణ్ణి నా దగ్గరకు పంపు. ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడని అతడు తెలుసుకుంటాడు>> అని సందేశం పంపించాడు. 9కాబట్టి నయమాను తన గుర్రాలతో, రథాలన్నిటితో వచ్చి ఎలీషా యింటి గుమ్మం ఎదుట నిలిచాడు. 10ఎలీషా ఒక వార్తాహరుడి చేత <<నీవు వెళ్లి యొర్దాను నదిలో ఏడు మునకలు వెయ్యి. నీ శరీరం పూర్వస్థితికి వస్తుంది. నీవు పరిశుభ్రం అవుతావు>> అని కబురు చేశాడు.

11నయమానుకు కోపం వచ్చింది. అక్కడ నుండి వెళ్ళిపోయాడు. <<ఆ వ్యక్తి బయటకు వచ్చి నా దగ్గర నిలిచి తన దేవుడైన యెహోవాకు ప్రార్ధన చేసి నా వంటిపై కుష్ఠరోగం ఉన్న చోట తన చెయ్యి ఆడించి బాగు చేస్తాడనుకున్నాను. 12ఇశ్రాయేలులో ఉన్న నదులన్నిటి కంటే దమస్కులోని అబానా, ఫర్పరు నదులు మంచివి కాదా? నేను వాటిలో స్నానం చేసి శుద్ధి పొందలేనా?>> అంటూ తీవ్ర కోపంతో అక్కడినుండి వెళ్ళిపోయాడు.

13అప్పుడు నయమాను సేవకులు అతని దగ్గరకు వచ్చి <<అయ్యా, ఆ ప్రవక్త ఒకవేళ ఏదన్నా కష్టమైన పని చేయమంటే నీవు తప్పకుండా చేసే వాడివే కదా! దానికంటే <నీటిలో మునిగి బాగు పడు> అని అతడు చెప్పడం ఇంకా మంచిదే కదా>> అన్నారు. 14అప్పుడు అతడు దేవుని మనిషి ఆదేశం ప్రకారం వెళ్ళి యొర్దాను నదిలో ఏడు సార్లు మునిగి లేచాడు. దాంతో అతని శరీరం పూర్తి స్వస్థత పొంది చిన్నపిల్లవాడి శరీరంలా పూర్వ స్థితికి వచ్చింది.

15నయమాను అప్పుడు సపరివార సమేతంగా తిరిగి దేవుని మనిషి దగ్గరకు వచ్చాడు. అతని ఎదుట నిలబడి ఇలా అన్నాడు <<చూడండి, ఇశ్రాయేలులో తప్ప భూమి మీద ఎక్కడా వేరే దేవుడు లేడని ఇప్పుడు నాకు తెలిసింది. కాబట్టి ఇప్పుడు నీ సేవకుడిచ్చే కానుక మీరు తీసుకోవాలి.>> 16కానీ ఎలిషా <<నేను దేవుని సన్నిధిలో నిలుచున్నాను. ఆయన మీద ఒట్టు. నేనేమీ తీసుకోను>> అని జవాబిచ్చాడు. ఎలీషా కానుక తీసుకోవాల్సిందే, అంటూ నయమాను పట్టుపట్టాడు కానీ ఎలీషా ఒప్పుకోలేదు.

17కాబట్టి నయమాను <<అలా అయితే నీ సేవకుడిని అయిన నాకు రెండు కంచర గాడిదలు మోయగలిగే మట్టి ఇప్పించు. ఎందుకంటే నేను ఈ రోజు నుండి యెహోవాకి తప్పించి మరి ఏ దేవుడికీ దహనబలి గానీ ఇంకా ఏ ఇతర బలిని గానీ అర్పించను. 18ఒక్క విషయంలో యెహోవా నీ సేవకుణ్ణి క్షమించాలి. అదేమిటంటే మా రాజుగారు రిమ్మోను దేవుణ్ణి పూజించడం కోసం మందిరంలో ప్రవేశించినప్పుడు నా చేతి మీద ఆనుకుంటాడు, అప్పుడు ఆయనతో పాటు నేను కూడా రిమ్మోను దేవుడి ఎదుట వంగుతాను. అలా నేను రిమ్మోను దేవుడి ఎదుట వంగినప్పుడు యెహోవా నీ సేవకుడినైన నన్ను క్షమిస్తాడు గాక>> అన్నాడు. 19అప్పుడు ఎలీషా <<ప్రశాంతంగా వెళ్ళు>> అన్నాడు. నయమాను అక్కడి నుండి కదిలాడు.

20అతడు అక్కడ నుండి కొద్ది దూరం వెళ్ళాక దేవుని మనిషి ఎలీషా సేవకుడైన గేహాజీ ఇలా అనుకున్నాడు. <<చూశావా, ఈ సిరియా వాడైన నయమాను తెచ్చిన కానుకలను తీసుకోకుండా నా యజమాని అతణ్ణి వదిలేశాడు. యెహోవా మీద ఒట్టు, నేనిప్పుడు పరుగెత్తుకుంటూ వెళ్ళి అతని దగ్గర ఏదైనా తీసుకుంటాను.>> 21ఇలా అనుకుని గేహాజీ నయమాను వెనకాలే వెళ్ళాడు. తన వెనకాలే ఎవరో పరుగెత్తుకుంటూ రావడం నయమాను చూసి తన రథంపై నుండి దిగి అతణ్ణి కలుసుకుని <<అంతా క్షేమమేనా?>> అని అడిగాడు. 22గేహాజీ <<అంతా క్షేమమే. నా యజమాని నన్ను పంపించాడు. <ఎఫ్రాయిము పర్వత ప్రాంతం లోని ప్రవక్తల సమాజం నుండి ఇద్దరు యువకులు ఇప్పుడే నా దగ్గరకు వచ్చారు. మీరు దయచేసి వారి కోసం ముప్ఫై అయిదు కిలోల వెండీ, రెండు జతల బట్టలూ ఇవ్వండి> అని చెప్పమన్నాడు>> అన్నాడు.

23అందుకు నయమాను <<నీకు డెబ్భై కిలోలు సంతోషంగా ఇస్తాను>> అన్నాడు. నయమాను గేహాజీని బలవంతపెట్టి రెండు బస్తాల్లో డెబ్భై కిలోల వెండి ఉంచి, రెండు జతల బట్టలూ ఇచ్చి వాటిని మోయడానికి తన దగ్గర ఉన్న ఇద్దరు పనివాళ్ళను పంపాడు. వాళ్ళు వాటిని మోసుకుని గేహాజీ ముందు నడిచారు. 24వాళ్ళు పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు గేహాజీ ఆ వెండి బస్తాలను తీసుకుని ఇంట్లో దాచిపెట్టి వాళ్ళను పంపించి వేశాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. 25తర్వాత అతడు లోపలికి వెళ్ళి తన యజమాని ఎలీషా ఎదుట నిలబడ్డాడు. ఎలీషా అతణ్ణి << గేహాజీ, నీవు ఎక్కడినుండి వస్తున్నావ్?>> అని అడిగాడు. దానికి గేహాజీ <<నీ సేవకుణ్ణి. నేను ఎక్కడికీ వెళ్ళలేదు>> అన్నాడు.

26అప్పుడు ఎలీషా గేహాజీతో <<ఆ వ్యక్తి నిన్ను కలుసుకోడానికి తన రథాన్ని ఆపినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదనుకున్నావా? డబ్బూ, మంచి బట్టలూ, ఒలీవ తోటలూ, ద్రాక్ష తోటలూ, గొర్రెలూ, పశువులూ, సేవకులూ, సేవకురాళ్ళూ వీటిని సంపాదించుకోడానికి ఇదా సమయం? అందుచేత నయమానుకి ఉన్న కుష్ఠు నీకూ, నీ వారసులకూ నిత్యం ఉంటుంది>> అన్నాడు. కాబట్టి గేహాజీకి మంచులా తెల్లని కుష్ఠరోగం వచ్చింది. అతడు ఎలీషా దగ్గరనుండి వెళ్ళి పోయాడు.

27

Copyright information for TelULB