‏ Exodus 12

1మోషే అహరోనులతో ఐగుప్తు దేశంలో యెహోవా ఇలా చెప్పాడు. 2<<నెలల్లో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరానికి మొదటి నెలన్న మాట.

3ఇశ్రాయేలు సమాజంతో ఇలా చెప్పు. మీరు ఇశ్రాయేలు ప్రజల సమాజమంతటితో కలసి ఈ నెల పదవ రోజున తమ కుటుంబాల ప్రకారం ప్రతి ఒక్కడూ, అంటే ప్రతి ఇంటి లెక్క చొప్పున ఒక గొర్రెెపిల్లను గానీ, మేకపిల్లను గానీ తీసుకోవాలి.

4ఒక కుటుంబం ఆ గొర్రెెపిల్లను తినడానికి చిన్నదైతే ఆ కుటుంబ పెద్ద ఒక గొర్రెె పిల్ల, లేక మేక పిల్ల సరిగ్గా సరిపోయే విధంగా తన పొరుగింటి కుటుంబ సభ్యులను కలుపుకుని ఆ ప్రకారం వారిని లెక్కగట్టాలి.

5మీరు ఎన్నుకొనే గొర్రెె లేదా మేక పిల్ల ఒక సంవత్సరం వయసు గల మగదై ఉండాలి. అది ఎలాంటి లోపం లేకుండా ఉండాలి. 6ఈ నెల 14 వ రోజు వరకు దాన్ని ఉంచాలి. తరువాత ఇశ్రాయేలు ప్రజలంతా సాయంకాల సమయంలో దాన్ని చంపాలి. 7కొంచెం రక్తం తీసుకుని ఆ మాంసం ఏ ఇంట్లో తింటారో ఈ ఇంటి గుమ్మం రెండు నిలువు కమ్ముల మీద, పై కమ్మీ మీద చల్లాలి.

8ఆ రాత్రివేళ నిప్పులతో మాంసాన్ని కాల్చి తినాలి. పొంగకుండా చేసిన రొట్టెలతో, చేదు కూరలతో కలిపి దాన్ని తినాలి.

9దాన్ని పచ్చిగా గానీ ఉడికించిగానీ తినకూడదు. దాని తల, కాళ్ళు, లోపలి భాగాలను నిప్పుతో కాల్చి తినాలి. 10తెల్లవారేపాటికి దానిలో ఏమీ మిగల్చకూడదు. ఒకవేళ ఏమైనా మిగిలితే దాన్ని పూర్తిగా కాల్చివెయ్యాలి.

11మీరు దాన్ని తినవలసిన విధానం ఇది. మీ నడుముకు నడికట్టు కట్టుకొని, కాళ్ళకు చెప్పులు వేసుకుని, మీ కర్రలు చేతబట్టుకుని త్వరత్వరగా తినాలి. ఎందుకంటే అది యెహోవాకు పస్కా బలి.

12నేను ఆ రాత్రి వేళ ఐగుప్తు దేశమంతా తిరుగుతూ ఆ దేశంలోని మనుషుల్లో, జంతువుల్లో మొదటి సంతానం మొత్తాన్ని చంపివేస్తాను. ఐగుప్తు దేవుళ్ళ విషయంలో తీర్పు తీరుస్తాను. నేను యెహోవాను. 13మీరు నివసించే ఇళ్ళపై ఉన్న ఆ రక్తం నా రాక విషయంలో మీకు ఆనవాలుగా ఉంటుంది. నేను ఐగుప్తు జాతి మొదటి సంతానాన్ని నాశనం చేస్తూ ఉన్న సమయంలో ఆ రక్తాన్ని చూసి మిమ్మల్ని చంపకుండా దాటి వెళ్ళిపోతాను. ఈ విపత్తు మీ మీదికి వచ్చి మిమ్మల్ని నాశనం చేయదు.

14కాబట్టి ఈ రోజు మీకు స్మారక దినంగా ఉంటుంది. ఈ రోజును యెహోవా పండుగ దినంగా తరతరాలుగా మీరు ఆచరించాలి. ఎందుకంటే ఇది యెహోవా నియమించిన శాశ్వతమైన కట్టుబాటు.

15ఏడు రోజులపాటు మీరు పొంగకుండా కాల్చిన రొట్టెలు తినాలి. మొదటి రోజున మీ ఇళ్ళలో పొంగ జేసే పదార్ధమంటూ ఏదీ లేకుండా చెయ్యాలి. మొదటి రోజు నుంచి ఏడవ రోజు వరకు పొంగ జేసే పిండితో చేసిన రొట్టెలు తింటే ఆ వ్యక్తిని ఇశ్రాయేలు ప్రజల్లో లేకుండా చేయాలి. 16ఆ మొదటి రోజు మీరు నా కోసం పరిశుద్ధ సమాజంగా సమకూడాలి. ఏడవ రోజున అలాటి సమావేశమే జరగాలి. ఆ రెండు రోజుల్లో అందరూ తినడానికి భోజనం సిద్ధం చేసుకోవడం తప్ప ఏ పనీ చేయకూడదు. మీరు చేయగలిగిన పని అదొక్కటే.

17ఈ పొంగని రొట్టెల పండుగను మీరు ఆచరించాలి. ఎందుకంటే నేను మిమ్మల్నందరినీ ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకు వచ్చే రోజు అదే. కాబట్టి మీరు, మీ రాబోయే తరాలన్నీ ఈ రోజును ఆచరించాలి. ఇది మీకు శాశ్వతమైన కట్టుబాటుగా ఉంటుంది. 18మొదటి నెల 14 వ రోజు సాయంత్రం మొదలు అదే నెల 21 వ రోజు సాయంత్రం దాకా మీరు పొంగని పిండితో చేసిన రొట్టెలు తినాలి.

19ఏడు రోజులపాటు మీ ఇళ్ళలో పొంగజేసే పదార్ధమేదీ కనబడ కూడదు. పొంగజేసే పదార్ధంతో చేసిన దాన్ని మీలో ఎవరైనా తింటే అతడు విదేశీయుడైనా దేశంలో పుట్టిన వాడైనా ఇశ్రాయేలు ప్రజల సమాజంలో లేకుండా చేయాలి. 20మీరు పొంగజేసే పదార్థంతో చేసిన దేనినీ తినకూడదు. మీకు చెందిన అన్ని ఇళ్ళలో పొంగకుండా కాల్చిన రొట్టెలు మాత్రమే తినాలి.>>

21అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజల పెద్దలను పిలిపించాడు. వాళ్ళతో ఇలా చెప్పాడు. <<మీరు మీ కుటుంబాల కోసం మందలోనుండి మేకపిల్లను గానీ గొర్రెెపిల్లను గానీ తీసుకుని పస్కా బలి అర్పించండి. 22తరువాత హిస్సోపు కుంచె తీసుకుని పళ్ళెంలో ఉన్న రక్తంలో దాన్ని ముంచి, గుమ్మాల పైకమ్మికీ రెండు నిలువు కమ్ములకూ పూయాలి. మీలో ఎవ్వరూ తెల్లవారే వరకూ మీ ఇళ్ళ గుమ్మాల గుండా బయటకు వెళ్ళకండి.

23యెహోవా ఐగుప్తీయులను హతమార్చడానికి తిరుగుతూ ఇంటి గుమ్మం పైకమ్మి మీదా రెండు నిలువు కమ్ముల మీదా ఉన్న రక్తాన్ని చూసి ఆ ఇంటిని దాటిపోతాడు. సంహారం చేసే దూతను మీ ఇళ్ళలోకి ప్రవేశించడానికి మిమ్మల్ని సంహరించడానికి ఆయన అనుమతి ఇయ్యడు.

24అందుచేత మీరు దీన్ని ఆచరించాలి. ఇది మీకు, మీ సంతతికి శాశ్వతమైన చట్టంగా ఉంటుంది. 25యెహోవా వాగ్దానం చేసినట్టు ఆయన మీకు ఇస్తున్న దేశంలో ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఒక ఆచార క్రియగా పాటించాలి.

26మీ కొడుకులు <మీరు జరిగిస్తున్న ఈ ఆచారం ఎందుకోసం?> అని మిమ్మల్ని అడిగితే, 27<ఇది యెహోవాకు పస్కాబలి. ఆయన ఐగుప్తీయులను సంహరించే సమయంలో వారి మధ్య నుండి ఇశ్రాయేలు ప్రజల ఇళ్ళను దాటి ఐగుప్తులో మనల్ని కాపాడాడు> అని చెప్పాలి>> అన్నాడు. అప్పుడు సమకూడిన ప్రజలంతా అది విని తమ తలలు వంచి దేవుణ్ణి ఆరాధించారు. 28అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు విధేయులై యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్టు చేశారు.

29ఆ అర్థరాత్రి సమయంలో ఏం జరిగిందంటే, ఐగుప్తు దేశంలో ఉన్న మొదటి సంతానమంతటినీ దేవుడు హతమార్చాడు. సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకుని, చెరసాలలోని ఖైదీల వరకు వాళ్ళకు పుట్టిన మొదటి పిల్లలు మరణించారు. పశువుల తొలిచూలు పిల్లలు చనిపోయాయి. 30ఆ రాత్రి గడిచిన తరువాత మరణం సంభవించని ఇల్లు ఒక్కటి కూడా లేదు. ఐగుప్తు దేశంలో తీవ్రమైన మరణ రోదన చెలరేగింది.

31ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. వాళ్ళతో, <<మీరూ ఇశ్రాయేలు ప్రజలూ త్వరగా నా దేశం నుండి, నా ప్రజల మధ్యనుండి వెళ్ళిపొండి. మీరు కోరుకున్నట్టు వెళ్లి యెహోవాను ఆరాధించండి. 32మీ ఇష్టప్రకారం మీ మందలనూ పశువులనూ తోలుకు వెళ్ళండి. నన్ను దీవించండి కూడా>> అన్నాడు. 33ఐగుప్తీయులు మేము కూడా చనిపోతాం అనుకుని ఆత్రంగా ఇశ్రాయేల్ ప్రజను తమ దేశం నుండి వెళ్ళిపొమ్మని తొందర పెట్టారు.

34ఇశ్రాయేలు ప్రజలు పొంగజేసే పదార్థం కలపని తమ పిండి ముద్దలు, పిండి పిసికే గిన్నెలు మూటగట్టుకుని భుజాలపై మోసుకు పోయారు. 35అంతకుముందు ఇశ్రాయేలు ప్రజలు మోషే చెప్పిన మాట ప్రకారం ఐగుప్తీయుల దగ్గర నుండి వెండి, బంగారం నగలు, దుస్తులు అడిగి తీసుకున్నారు. 36ఐగుప్తీయులకు ఇశ్రాయేలు ప్రజల పట్ల యెహోవా జాలి గుణం కలిగించడం వల్ల వారు ఇశ్రాయేలు ప్రజలు అడిగినవన్నీ ఇచ్చారు. ఆ విధంగా వారు ఐగుప్తీయులను దోచుకున్నారు.

37తరువాత ఇశ్రాయేలు ప్రజలు రామసేసు నుండి సుక్కోతు వరకు ప్రయాణం సాగించారు. వారిలో పిల్లలు కాక, కాలి నడకన బయలుదేరిన పురుషులు ఆరు లక్షల మంది. 38అంతేకాక వేరువేరు జాతుల మనుషులు చాలా మంది వారితో వచ్చారు. గొర్రెెలు, ఎద్దులు మొదలైన పశువులతో కూడిన గొప్ప మందలు కూడా వాళ్ళతో కలసి బయలుదేరాయి. 39తరువాత వాళ్ళు ఐగుప్తు నుండి తెచ్చిన పిండి ముద్దలతో పొంగని రొట్టెలు కాల్చారు. ఆ పిండి ముద్ద పులియలేదు. వాళ్ళు ఐగుప్తునుండి బయలు దేరే ముందు సమయం లేకపోవడం వల్ల తమ కోసం వేరే ఆహారం సిద్ధం చేసుకోలేక పోయారు.

40ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలం 430 సంవత్సరాలు.

41ఆ 430 సంవత్సరాలు ముగిసిన రోజునే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశం నుండి తరలి వెళ్లాయి. 42ఆయన ఐగుప్తు దేశం నుండి వారిని బయటికి రప్పించిన ఆ రాత్రి యెహోవా కోసం కేటాయించి ఇశ్రాయేలు ప్రజలంతా తరతరాలకూ ఆ రాత్రి యెహోవా కోసం జాగారం చెయ్యాలి.

43తరువాత యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నాడు, <<ఇది పస్కా పండుగను గూర్చిన నియమం. వేరే జాతికి చెందిన వాడెవడూ దాన్ని తినకూడదు. 44మీలో ఎవరైనా డబ్బిచ్చి కొనుక్కున్న దాసుడు సున్నతి పొందితే అలాంటి వాడు దాన్ని తినవచ్చు.

45వేరే దేశాలకు చెందిన వాళ్ళు, కూలి పనికి వచ్చిన సేవకులు దాన్ని తినకూడదు. 46ఏ ఇంటిలో వారు ఆ ఇంటిలో మాత్రమే దాన్ని తినాలి. దాని మాంసంలో కొంచెం కూడా ఇంట్లో నుండి బయటికి తీసుకు వెళ్ళకూడదు. వధించిన జంతువులోని ఒక్క ఎముకను కూడా మీరు విరగ్గొట్టకూడదు.

47ఇశ్రాయేలు ప్రజల సమాజం అంతా పండగ ఆచరించాలి. 48మీ దగ్గర నివసించే ఎవరైనా విదేశీయులు యెహోవా పస్కాను ఆచరించాలని కోరుకుంటే వాళ్ళ కుటుంబంలోని ప్రతి మగవాడూ సున్నతి పొందాలి. అప్పుడు వాళ్ళు సమాజంతో కలసి పస్కా ఆచరింపవచ్చు. వాళ్ళు మీ దేశంలో పుట్టిన వాళ్ళతో సమానం అవుతారు. సున్నతి పొందనివాడు దాన్ని తినకూడదు.

49స్వదేశీయుడికీ మీతో కలసి నివసించే విదేశీయుడికీ ఈ విషయంలో ఒకే నియమం ఉండాలి.>>

50యెహోవా మోషే అహరోనులకు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం ఇశ్రాయేలు ప్రజలందరూ చేశారు. ఆ రోజే యెహోవా ఇశ్రాయేలు ప్రజలను వారి వారి సేనల క్రమం ప్రకారం ఐగుప్తు దేశం నుండి బయటకు నడిపించాడు.

51

Copyright information for TelULB