‏ Exodus 14

1యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, 2<<ఇశ్రాయేలు ప్రజలు వెనక్కి తిరిగి పీహహీరోతు ఎదుట, అంటే మిగ్దోలుకూ, సముద్రానికీ మధ్యలో ఉన్న బయల్సెఫోను దగ్గర విడిది చేయమని వారితో చెప్పు. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు 3ఫరో, <ఆ ప్రజలు ఈ దేశంలో ఎడారి మధ్యలో చిక్కుబడిపోయారు> అనుకొంటాడు.

4నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తున్నాను. అతడు వాళ్ళను తరుముతాడు. నేను ఫరో ద్వారా, మిగిలిన అతని సేన ద్వారా మహిమ పొందుతాను. నేను యెహోవాను అని ఐగుప్తీయులు తెలుసుకుంటారు.>> 5ఇశ్రాయేలు ప్రజలు దేశం విడిచి వెళ్ళిపోయిన విషయం ఐగుప్తు రాజుకు చెప్పినప్పుడు ఫరో హృదయం, అతని సేవకుల హృదయాలు ఇశ్రాయేలు ప్రజపై కక్షతో నిండి పోయాయి. <<మనం చేసిందేమిటి? మన కోసం పనులు చేయకుండా వాళ్ళను ఎందుకు వెళ్ళనిచ్చాం?>> అని చెప్పుకున్నారు.

6అప్పుడు ఫరో తన రథాలు సిద్ధం చేయించి తన సైన్యాన్ని వెంట బెట్టుకొని బయలుదేరాడు. 7అతడు తన ఐగుప్తులోని శ్రేష్ఠమైన 600 రథాలను, ప్రతి రథంలోనూ సైన్యాధిపతులను తీసుకు పోయాడు. 8యెహోవా ఐగుప్తు రాజు ఫరో హృదయాన్ని కఠినం చేసినందువల్ల అతడు ఇశ్రాయేలు ప్రజలను తరిమాడు. ఇశ్రాయేలు ప్రజలు తమ బలగం అంతటితో తరలి వెళ్తున్నారు. 9బయల్సెఫోను ఎదురుగా ఉన్న పీహహీరోతుకు దగ్గరలో సముద్రం దగ్గర వాళ్ళు విడిది చేసి ఉన్న సమయంలో ఫరో రథాలు, గుర్రాలు, గుర్రాల రౌతులు, ఐగుప్తు సైన్యం ఇశ్రాయేలు ప్రజలను తరుముతూ వాళ్ళను సమీపించారు.

10ఫరో, అతని సైన్యం తమను తరుముతూ రావడం చూసిన ఇశ్రాయేలు ప్రజలు హడలిపోయారు. కేకలు వేస్తూ యెహోవాకు మొరపెట్టారు. 11అప్పుడు వాళ్ళు మోషేతో <<ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఈ ఎడారిలో చనిపోవడానికి తీసుకొచ్చావా? మమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకువచ్చి ఈ విధంగా చేస్తావా? 12మేము ఐగుప్తీయులకు బానిసలుగానే ఉంటాం, మా జోలికి రావద్దు అని ఐగుప్తులో ఉన్నప్పుడే చెప్పింది ఇందుకే గదా. మేము ఈ ఎడారిలో చనిపోవడం కంటే ఐగుప్తులో బానిసలుగా బతకడమే మంచిది>> అని నిష్టూరంగా మాట్లాడారు.

13అందుకు మోషే <<భయపడకండి, ఈ రోజు యెహోవా మీకు కలిగించే రక్షణను అలా నిలబడి చూడండి. మీరు ఈ రోజు చూసిన ఐగుప్తీయులను ఇకపై ఎన్నడూ చూడరు. 14మీరు ఊరికే నిలబడి ఉండండి. మీ పక్షంగా యెహోవా యుద్ధం చేస్తాడు>> అని ప్రజలతో చెప్పాడు.

15యెహోవా మోషేతో <<నువ్వెందుకు నాకు మొర పెడుతున్నావు? <ముందుకు కొనసాగండి> అని ప్రజలతో చెప్పు. 16నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని రెండు పాయలుగా చెయ్యి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన పొడి నేల మీద నడిచి వెళ్తారు. 17చూడు, నేను ఐగుప్తీయుల హృదయాలను కఠినం చేస్తాను. వాళ్ళు మీ వెంటబడి తరుముతారు. నేను ఫరో ద్వారా, అతని సైన్యం అంతటి ద్వారా, అతని రథాల, గుర్రపు రౌతుల ద్వారా ఘనత తెచ్చుకొంటాను. 18నేను ఫరో ద్వారా, సైన్యం ద్వారా, అతని రథాల, గుర్రపు రౌతుల ద్వారా ఘనత పొందడం వల్ల నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటారు.>>

19అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజల ముందు నడిచిన దేవదూత వాళ్ళ వెనక్కి వెళ్ళాడు. మేఘస్తంభం కూడా వాళ్ళ వెనక్కి వచ్చి నిలిచింది. 20అది ఐగుప్తు సేనలకూ ఇశ్రాయేలు ప్రజల సమూహనికీ మధ్య నిలిచింది. ఆ మేఘం ఆ రాత్రంతా ఐగుప్తు సైన్యానికి చీకటి కమ్మేలా, అదే సమయంలో ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు ఉండేలా చేసింది.

21మోషే సముద్రంపై తన చెయ్యి చాపాడు. యెహోవా ఆ రాత్రి అంతా బలమైన తూర్పు గాలి వీచేలా చేసి, సముద్రం పాయలుగా చీలి మధ్యలో ఆరిపోయి పొడి నేల ఏర్పడేలా చేశాడు. 22సముద్రం నీళ్లు రెండుగా విడిపోగా ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేలపై నడిచి వెళ్ళారు. ఆ నీళ్లు వారి కుడి పక్కన, ఎడమ పక్కన గోడల్లాగా నిలబడ్డాయి.

23ఫరో సైన్యం, గుర్రాలు, రథాలు, రౌతులు వారిని తరుముకుంటూ సముద్రం మధ్యకు చేరుకున్నారు. 24తెల్లవారుతుండగా యెహోవా ఆ అగ్ని స్తంభం నుండీ మేఘ స్తంభం నుండీ ఐగుప్తు సైన్యాన్ని చూసి వాళ్ళను కలవరానికి గురి చేశాడు. 25ఆయన వాళ్ళ రథచక్రాలు ఊడిపోయేలా చేసినప్పుడు వాళ్ళు అతి కష్టంగా రథాలు తోలవలసి వచ్చింది. అప్పుడు ఐగుప్తువాళ్ళు <<రండి, మనం ఇశ్రాయేలు ప్రజల ఎదుట నుండి పారిపోదాం. యెహోవా వారికి తోడుగా ఉండి వాళ్ళ పక్షంగా యుద్ధం చేస్తున్నాడు>> అని చెప్పుకున్నారు.

26యెహోవా మోషేతో, <<ఐగుప్తు సైన్యం మీదికి, వాళ్ళ రథాల, రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చేలా సముద్రం పైకి నీ చెయ్యి చాపు>> అని చెప్పాడు. 27మోషే సముద్రం పైకి తన చెయ్యి చాపాడు. సాయంత్రం అయ్యేటప్పటికి సముద్రం వడిగా మళ్ళీ కలిసిపోయింది. అది చూసిన ఐగుప్తు సైన్యం వెనక్కి పారిపోవాలని చూశారు. అప్పుడు యెహోవా సముద్రం మధ్యలో ఐగుప్తు సైన్యం నాశనమయ్యేలా చేశాడు. 28నీళ్లు వేగంగా ప్రవహించి ఆ రథాలను, రౌతులను, వారి వెనుక సముద్రంలోకి వచ్చిన ఫరో సైన్యం మొత్తాన్నీ ముంచివేశాయి. వాళ్ళలో ఒక్కడు కూడా మిగలకుండా అంతా తుడిచిపెట్టుకు పోయారు.

29అయితే ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేలపై నడిచినప్పుడు ఆ నీళ్లు వారికి కుడి, ఎడమ పక్కల గోడల్లాగా నిలబడ్డాయి. 30ఆ రోజున యెహోవా ఐగుప్తు సైన్యం నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించాడు. చనిపోయి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఐగుప్తు వాళ్ళను ఇశ్రాయేలు ప్రజలు చూశారు. తమ కోసం యెహోవా ఐగుప్తు వాళ్ల పట్ల చేసిన ఈ గొప్ప కార్యం చూసిన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడంటే భయభక్తులు కలిగాయి. ఆ ప్రజలు యెహోవా మీదా, ఆయన సేవకుడు మోషే మీదా నమ్మకముంచారు.

31

Copyright information for TelULB