Exodus 5
1ఈ విషయాలు జరిగిన తరువాత మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్లి, <<ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు: ఎడారిలో నా కోసం ఉత్సవం చేయడానికి నా ప్రజలను వెళ్ళనివ్వు>> అని చెప్పారు. 2అందుకు ఫరో, <<యెహోవా ఎవరు? నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను ఎందుకు వెళ్ళనివ్వాలి? నాకు యెహోవా అంటే ఎవరో తెలియదు. ఇశ్రాయేలీయులను వెళ్ళనివ్వను>> అన్నాడు. 3అప్పుడు ఆ ఇద్దరూ, <<హెబ్రీయుల దేవుడు మాతో మాట్లాడాడు. మాకు అనుమతి ఇస్తే మేము ఎడారిలోకి మూడు రోజుల ప్రయాణమంత దూరం వెళ్లి మా దేవుడైన యెహోవాకు బలి అర్పిస్తాం, లేని పక్షంలో ఆయన మమ్మల్ని ఏదైనా తెగులుకు, ఖడ్గానికి గురి చేస్తాడేమో>> అన్నారు. 4ఐగుప్తు రాజు, << మోషే, అహరోనూ ఈ ప్రజలు తమ పనులు చేసుకోకుండా మీరు అడ్డు పడుతున్నారేమిటి? పోయి మీ పనులు చూసుకోండి. 5మా దేశంలో హెబ్రీయుల జనాభా ఇప్పుడు బాగా పెరిగిపోయింది. వాళ్ళంతా తమ పనులు మానుకునేలా మీరు చేస్తున్నారు>> అని వాళ్ళతో అన్నాడు. 6ఆ రోజున ఫరో ప్రజల గుంపుల నాయకులకు, వారి పైఅధికారులకు ఇలా ఆజ్ఞాపించాడు. 7<<ఇటుకలు చేయడానికి ఉపయోగించే గడ్డి ఇకనుండి మీరు ఇవ్వకండి. వాళ్ళే వెళ్లి కావలసిన గడ్డి తెచ్చుకోవాలి. 8అయినప్పటికీ వాళ్ళు లెక్క ప్రకారం ఇంతకు ముందు చేసినట్టుగానే ఇటుకల పని చెయ్యాలి. వాళ్ళు సోమరిపోతులు కనుక లెక్క ఏమాత్రం తగ్గించవద్దు. అందుకే వారు <మేము వెళ్లి మా దేవునికి బలులు అర్పించడానికి అనుమతి ఇవ్వండి> అని కేకలు వేస్తున్నారు. 9అలాంటి వాళ్లకు మరింత కష్టమైన పనులు అప్పగించండి. అప్పుడు వాళ్ళు ఆ అబద్ధపు మాటలు నమ్మకుండా కష్టపడి పని చేసుకుంటారు>> అన్నాడు. 10కాబట్టి పర్యవేక్షకులు, పైఅధికారులు వెళ్లి ప్రజలతో <<మేము మీకు గడ్డి ఇయ్యము. 11మీరే వెళ్లి గడ్డి ఎక్కడ దొరుకుతుందో వెతికి సంపాదించుకోండి. అయితే మీ పని ఏమాత్రం తగ్గించము అని ఫరో సెలవిచ్చాడు>>అన్నారు. 12అప్పుడు ప్రజలు గడ్డికి బదులు కొయ్యకాడ పుల్లలు సమకూర్చుకోవడానికి ఐగుప్తు దేశమంతటా చెదిరిపోయారు. 13అంతేకాదు, ఆ పర్యవేక్షకులు వాళ్ళను ఒత్తిడి చేస్తూ <<గడ్డి ఇస్తున్నప్పటి లాగానే ఏ రోజు పని ఆ రోజు లెక్క ప్రకారం పూర్తి చేయాలి>>అని బలవంతపెట్టారు. 14ఫరో ఆస్థాన అధికారులు తాము ఇశ్రాయేలు ప్రజల గుంపులపై నియమించిన ఇశ్రాయేల్ నాయకులను కొట్టారు. <<ఇది వరకు లాగా మీ లెక్క ప్రకారం ఇటుకలు నిన్న, ఈ రోజు ఎందుకు చేయించ లేదు?>> అని అడిగారు. 15ఇశ్రాయేలు ప్రజల గుంపులపై నియమించిన తనిఖీదారులు ఫరో దగ్గరికి వచ్చారు. <<తమ దాసులమైన మా పట్ల మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? 16తమ దాసులకు గడ్డి ఇవ్వకుండా రోజువారీ లెక్క ప్రకారం ఇటుకలు తయారు చేయమని ఆజ్ఞాపిస్తున్నారు. అధికారులు తమ దాసులైన మా నాయకులను హింసిస్తున్నారు. అసలు తప్పు తమ ఆస్థాన అధికారులదే>> అని మొర పెట్టుకున్నారు. 17అప్పుడు ఫరో, <<మీరు సోమరిపోతులు, వట్టి సోమరిపోతులు. అందుకే <మేము వెళ్లి యెహోవాకు బలులు అర్పించాలి> అని అనుమతి అడుగుతున్నారు. 18మీరు వెళ్లి పని చెయ్యండి. మీకు గడ్డి ఇవ్వడం జరగదు. మీరు మాత్రం లెక్క ప్రకారం ఇటుకలు అప్పగించక తప్పదు. 19మీ ఇటుకలు లెక్కలో ఏమాత్రం తగ్గకూడదు, ఏ రోజు పని ఆ రోజే ముగించాలి>> అని చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజల నాయకులు తాము దుర్భరమైన స్థితిలో కూరుకు పోయామని గ్రహించారు. 20వాళ్ళు ఫరో దగ్గర నుండి తిరిగి వస్తూ, వారిని కలుసుకోవడానికి దారిలో ఎదురు చూస్తున్న మోషే, అహరోనులను కలుసుకొన్నారు. 21వాళ్ళు, <<యెహోవా మీకు తగిన విధంగా న్యాయం చేస్తాడు గాక. ఫరో ఎదుట, అతని సేవకుల ఎదుట మీరే మమ్మల్ని నీచులుగా చేసి, మమ్మల్ని చంపించడానికి వాళ్ళ చేతులకు కత్తులు ఇచ్చిన వాళ్ళయ్యారు.>> అన్నారు. 22మరోసారి మోషే యెహోవా దగ్గరికి వెళ్లి, << ప్రభూ, ఈ ప్రజలకు ఎందుకు హాని కలిగించావు? నన్ను ఎందుకు పంపించావు? నేను నీ ప్రతినిధిగా మాట్లాడడానికి ఫరో దగ్గరకు వచ్చినప్పటి నుంచి అతడు ఈ ప్రజలకు మరింత హాని కలిగిస్తున్నాడు. నువ్వు నీ ప్రజలను విడిపించడానికి నీవు ఏమీ చేయలేదు>> అన్నాడు. 23
Copyright information for
TelULB