‏ Genesis 7

1యెహోవా, <<ఈ తరంలో నా దృష్టిలో నువ్వే నీతిమంతుడవుగా ఉండడం చూశాను కాబట్టి నువ్వు, నీ కుటుంబం ఓడలో ప్రవేశించండి. 2శుద్ధమైన జంతువుల్లో ప్రతి జాతిలో మగవి ఏడు, ఆడవి ఏడు, శుద్ధంకాని జంతువుల్లో ప్రతి జాతిలో మగ ఆడ రెండు, 3ఆకాశపక్షుల్లో ప్రతి జాతిలో మగవి ఏడు, ఆడవి ఏడు తీసుకురావాలి. నువ్వు భూమి అంతటిమీద వాటి సంతానాన్ని ప్రాణంతో ఉంచి భద్రం చేసేలా అలా చెయ్యాలి.

4ఎందుకంటే, ఇంకా ఏడు రోజుల్లో నేను, నలభై పగళ్ళు, నలభై రాత్రులు భూమిమీద వర్షం కురిపించి, నేను చేసిన జీవం ఉన్న ప్రతి దాన్ని నాశనం చేస్తాను>> అని నోవహుతో చెప్పాడు. 5తనకు యెహోవా ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం నోవహు అంతా చేశాడు.

6ఆ జలప్రళయం భూమిమీదికి వచ్చినప్పుడు నోవహుకు వయస్సు ఆరు వందల సంవత్సరాలు. 7నోవహు, అతనితోపాటు అతని కొడుకులు, అతని భార్య, అతని కోడళ్ళు ఆ జలప్రళయం తప్పించుకోడానికి ఆ ఓడలో ప్రవేశించారు.

8దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారం శుద్ధ జంతువుల్లో, అపవిత్ర జంతువుల్లో, పక్షుల్లో నేలమీద పాకే వాటన్నిటిలో, 9మగ, ఆడ, జతలుగా ఓడలో ఉన్న నోవహు దగ్గరకు చేరాయి. 10ఏడు రోజుల తరువాత ఆ ప్రళయజలాలు భూమిమీదికి వచ్చాయి.

11నోవహు వయస్సు ఆరువందల సంవత్సరాల రెండు నెలల పదిహేడవ రోజున, మహా అగాధజలాల ఊటలన్నీ తెరుచుకున్నాయి. ఆకాశపు కిటికీలు తెరుచుకున్నాయి. 12నలభై పగళ్ళు, నలభై రాత్రులు భూమిమీద వర్షం కురిసింది.

13ఆ రోజే నోవహు, నోవహు కొడుకులు షేము, హాము, యాపెతు, నోవహు భార్య, వాళ్ళతోపాటు అతని ముగ్గురు కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశించారు. 14వాళ్ళతోపాటు, వాటి వాటి జాతుల ప్రకారం ప్రతి మృగం, వాటి వాటి జాతుల ప్రకారం ప్రతి పశువు, వాటి వాటి జాతుల ప్రకారం నేలమీద పాకే ప్రతి పురుగు, వాటి వాటి జాతుల ప్రకారం ప్రతి పక్షి, నానావిధాల రెక్కల పక్షులు ప్రవేశించాయి.

15శ్వాస పీల్చగల, శరీరం కలిగినవన్నీ రెండేసి చొప్పున నోవహు దగ్గరకు వచ్చి, ఓడలో ప్రవేశించాయి. 16ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం శరీరం కలిగిన ఆ జీవులన్నీ, మగవిగా, ఆడవిగా, ప్రవేశించాయి. అప్పుడు యెహోవా, వాళ్ళను ఓడలో ఉంచి, ఓడ తలుపు మూశాడు.

17ఆ జలప్రళయం నలభై రోజులు భూమి మీదికి వచ్చినప్పుడు, నీళ్ళు విస్తరించి ఓడను నీళ్ళ మీద తేలేలా చేశాయి. ఓడ భూమి మీద నుంచి పైకి లేచింది. 18నీళ్ళు భూమి మీద భీకరంగా ప్రవహించి అధికంగా విస్తరించినప్పుడు, ఆ ఓడ నీళ్ళ మీద తేలింది.

19ఆ భీకర జలాలు భూమి మీద పైపైకి లేచినప్పుడు, ఆకాశం కింద ఉన్న ఎత్తైన పర్వతాలన్నీ మునిగిపోయాయి. 20ఎత్తైన పర్వత శిఖరాలకన్నా పదిహేను మూరలు ఎత్తుగా నీళ్ళు విస్తరించాయి.

21పక్షులు, పశువులు, మృగాలు భూమిమీద పాకే పురుగులు, శరీరం ఉండి భూమిమీద తిరిగేవన్నీ చనిపోయాయి. మనుషులందరూ చనిపోయారు. 22పొడి నేలమీద ఉన్న వాటన్నిటిలో, నాసికారంధ్రాలలో ఊపిరి ఉన్నవన్నీ చనిపోయాయి.

23మనుషులతో పాటు పశువులు, పురుగులు, ఆకాశపక్షులు, నేలమీద ఉన్న జీవాలన్నీ అంతం అయిపోయాయి. అవన్నీ భూమిమీద ఉండకుండా నాశనం అయ్యాయి. నోవహు, అతనితో పాటు ఆ ఓడలో ఉన్నవి మాత్రం మిగిలాయి. నూట ఏభై రోజుల వరకు భూమిమీద నీళ్ళు ఆధిపత్యం ప్రదర్శించాయి.

24

Copyright information for TelULB